మీరు కూడా నెలకు 5 కోట్లు సంపాదించండి ఇలా…

ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ ఓ కామన్ మ్యాన్ ..కోటీశ్వరుడు అయ్యిన వైనం. సరదాగా తన ముద్దుల కూతురు కోసం పెట్టిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఈ రోజున 60 కోట్ల ఫ్రాఫిట్ తో నడుస్తోంది.  కూతురిని లాలించటం కోసం తనకొచ్చిన లాలిపాటలు పాడిన వినోద్ చందర్ ..తన పాపాయి లాగే పిల్లలందరూ రైమ్స్ అంటే తెగ ఇష్టపడతారు కదా అని ఆలోచించాడు. ఆలోచించటమే తరువాయి..దాన్ని అమలు పరిచి యానిమేటెడ్ వీడియోస్ తయారు చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అది హిట్ అవటంతో ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడదే కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయి ఎంతోమందికి ప్రేరణ ఇస్తోంది. ఆ యూట్యూబ్ ఛానెల్ పేరు  ‘చూచూ టీవీ’ .  వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన వినోద్‌ చందర్‌ కు సంగీత,సాహిత్య వారసత్వం ఉంది. ఆయన తండ్రి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్. 1980, 1990లలో రజనీకాంత్ సినిమాలతో పాటు దాదాపు 250 సినిమాలకు సంగీతం అందించారు. అయితే వినోద్ కు మొదటి నుంచి ఆ వైపు పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఆయన 2011లో కుమార్తె హర్షిత పుట్టాక ..ఆ పాపని నిద్రపుచ్చటానికి లాలిపాటలు పాడేవాడు. తర్వాత మెల్లిమెల్లిగా హర్షిత యూట్యూబ్ లో రైమ్స్ చూడటానికి బాగా ఇంట్రస్ట్ చూపించేది. దీంతో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన వినోద్ ఆ తర్వాత నర్సరీ రైమ్స్ కోసం యూనిమేటెడ్, డాన్సింగ్ వీడియోలు క్రియేట్ చేయటం మొదలెట్టారు. హర్షిత ముద్దు పేరు చూచూ. 

 చూచూ పోలికలున్న పాపతో ‘చబ్బీ చీక్స్‌…’కి యానిమేషన్‌ వీడియో రూపం ఇచ్చాడు వినోద్‌. యూట్యూబ్‌లో సరదాగా ‘చూచూ టీవీ’ పేరుతో ఛానెల్‌పెట్టి వీడియోని అప్‌లోడ్‌ చేశాడు. ఆకర్షణీయమైన రంగులూ, వినసొంపైన గొంతు, శ్రావ్యమైన సంగీతం… ఆ వీడియో ప్రత్యేకతలు కావటంతో సూపర్ హిట్ అయ్యింది.  కొన్ని నెలల్లోనే దాన్ని మూడు లక్షల మంది చూశారు.  ఆ విషయాన్ని స్నేహితులకు చెప్పి… అక్కడున్న బిజినెస్ ఆపర్టునిటీ  గురించి వివరించాడు. వినోద్,  సురేష్‌, అజిత్‌, సుబ్బిరామనియన్‌, కృష్ణన్‌, పార్థసారథి… ఈ ఆరుగురూ చూచూ టీవీని 2013 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వారంతా చిన్ననాటి స్నేహితులు కూడా.  తర్వాత ‘ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌…’ని తమదైన శైలిలో చిత్రీకరించి చూచూలో అప్‌లోడ్‌ చేస్తే… లక్షల్లో వ్యూస్. నెల రోజుల్లో ఆ ఛానెల్‌ని అయిదు వేల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ‘చూచూకి మంచి రెస్పాన్స్   వస్తోంది… మరిన్ని వీడియోలు పెట్టండి’ అంటూ యూట్యూబ్‌ ప్రతినిధుల నుంచి ఫోన్‌.  చూస్తండగానే చూచూ టీవీని సగటున రోజుకి 7000 మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకోవటం మొదలైంది. సంస్థ ఆదాయం నెలకు రూ.కోటి నుంచి అయిదు కోట్ల వరకూ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల విభాగంలో సబ్‌స్క్రిప్షన్లలో చూచూది ఆరో స్థానం.  వ్యూస్ ల్లో తొమ్మిదో స్థానం. రైమ్స్‌, పజిల్స్‌, కలరింగ్‌ విభాగాల్లో ‘చూచూ’ ఆప్స్‌ కూడా వచ్చాయి. గతేడాది ‘చూచూ టీవీ సర్‌ప్రైజ్‌’ పేరుతో మరో ఛానెల్‌నీ ప్రారంభించారు. దీనిలో అక్షరాలూ, అంకెలూ, రంగుల్లాంటివి నేర్పే వీడియోలుంటాయి. దీనికి పదిలక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. అదండీ చూచూ విజయగాధ. మరి మీరు కూడా చక్కగా ఇలాంటి ఆలోచన చేసి కోట్లు మంది హృదయాలు గెలవటమే కాక..కోట్లు సంపాదించవచ్చు ..ట్రై చేయండి…ట్రై చేస్తే పోయేదేముంది..మన చుట్టూ ఉన్న ఆర్దిక బానిస సంకెళ్లు తప్ప..